చంద్రబాబు కేసు విచారణలో జడ్జి "నాట్ బిఫోర్ మీ" ట్విస్ట్-తప్పుకుంటానని ఆఫర్ !
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సీఐడీ తనను అరెస్టు చేయడాన్ని, రిమాండ్ కు పంపడాన్ని క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు నాలుగో నంబర్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ముందుగానే అలర్ట్ అయ్యారు. చంద్రబాబు లాయర్లకు ముందుగానే ఓ విషయం క్లారిటీగా చెప్పేశారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టాల్సిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ ప్రారంభం కాకముందే ఇరు పక్షాలకూ ఓ విషయం చెప్పారు. తాను గతంలో ప్రభుత్వ న్యాయవాది (పీపీ)గా పనిచేశానని, తన నేపథ్యం ఈ కేసును తాను విచారించేందుకు అడ్డంకి అని భావిస్తున్నారా, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగారు. అభ్యంతరాలు ఉంటే ముందే చెప్పాలని, తాను నాట్ బిఫోర్ మీ తీసుకుని ఈ కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేస్తానని స్పష్టం చేశారు.

జడ్జి శ్రీనివాసరెడ్డి చేసిన సూచనపై చంద్రబాబు తరఫు లాయర్లతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు కూడా స్పందించారు. ఈ కేసును జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారించడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు ఏమీ లేవని తేల్చిచెప్పేశారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన జడ్జి శ్రీనివాసరెడ్డి పూర్తి వాదనలు విన్నాకే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఆలోపు చంద్రబాబును కస్టడీకి ఇచ్చే పిటిషన్ పై విచారణను ఆపాలని విజయవాడ ఏసీబీ కోర్టుకు సూచించారు.
గతంలో తాను పీపీగా పనిచేయడం వల్ల ఈ కేసులో తాను ఇచ్చే తీర్పుపై ఆ తర్వాత ప్రభావం పడటం ఇష్టం లేక జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇలా ఇరుపక్షాలకూ ముందుగానే ఆ విషయం స్పష్టం చేశారు. ఇరుపక్షాలు కూడా ఒప్పుకోవడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి.. వచ్చే వారం దీనిపై తీర్పు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో నాట్ బిఫోర్ మీ అంశం ఈ కేసు విచారణకు వర్తించకుండా పోయింది.












Click it and Unblock the Notifications