చిరంజీవితో కాపులకు ఒరిగిందేమీ లేదు: బహిరంగ లేఖలో మండిపడ్డ రామానుజయ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చిరంజీవికి ఆయన బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవితో కాపులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి పదవిలో ఉండగా చిరంజీవి కాపులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి చిరంజీవి అడ్డుపడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుంటే, ప్రభుత్వంపై కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాపులకు అన్యాయం చేసే వ్యక్తులతో చిరంజీవి చేతులు కలపడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న ముద్రగడకు మద్దతుగా నిలుస్తున్నా చిరంజీవి కాపులకు అన్యాయం చేసే దిశగానే పయనిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వల్లే కాపులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications