కార్యకర్తల సంక్షేమం కోసం రూ.50 కోట్లు కేటాయించిన ఏపీ మంత్రి..!
ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తన నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభవార్త తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కార్యకర్తలను ఆదుకోవడానికి తన సొంత డబ్బును వినియోగించనున్నారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం రూ.10 కోట్లు చొప్పున.. 5 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
175 మందికి రూ.45 లక్షల చెక్కుల పంపిణీ..
ఈ మేరకు నెల్లూరులో మంత్రి నారాయణ తన భార్య రమాదేవితో కలిసి.. 175 మంది కార్యకర్తలకు రూ.45 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన విజయానికి మద్దతుగా నిలిచిన వారి రుణం తీర్చుకునేందుకు ఈ రకంగా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఆరోగ్య సహాయం, ఆర్థిక సహాయాలు, అత్యవసర ఖర్చులకు ఈ డబ్బును అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

అలానే నారాయణ మాట్లాడుతూ.. తన విజయానికి మూలకారణం కార్యకర్తలే అని కొనియాడారు. వారందరి కోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. నెల్లూరు నగర సమగ్రాభివృద్ధికి ఒక పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా నెల్లూరులో 5 వేల మంది అర్హులైనవారికి ఇళ్ల పట్టాలను అందించాలన్నదే తన తదుపరి లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులతో కలిసి కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తనని నమ్ముకున్న కార్యకర్తలకు ఈ విధంగా అండగా ఉండడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications