బాబునేనా, కెసిఆర్‌ను ఎందుకనరు: జగన్‌పై మంత్రులు
హైదరాబాద్: తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తున్న జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ఎందుకు మాట్లాడడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రుణమాఫీపై చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా స్పందించారు.
నెలాఖరులోగా రైతులకు రుణ మాఫీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే తన లక్ష కోట్లు ఇచ్చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తమ తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శించే హక్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు లేదని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

శుక్రవారం వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల్లో రుణమాఫీ చేయకపోతే మెడలు వంచుతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అసలు పాలన, రాజకీయాలు జగన్‌కు ఏమి తెలుసునని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మిలాఖతై రాష్ట్ర విభజనకు కారకుడైన వ్యక్తి పాలన, ప్రజల గురించి మాట్లాడడం సరి కాదని వారన్నారు. అటువంటి వ్యక్తి తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఎర్రచందనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి ఎక్కడ ఉన్నారో అతనితో సంబంధం ఉన్న జగన్ చెప్పాలని మంత్రులు అన్నారు. చెన్నై ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరణిస్తే వెంటనే స్పందించింది చంద్రబాబేనని, ఆ విషయం జగన్‌కు తెలియక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని దేవినేని, అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications