కర్నాటక బస్సులో ఏపీ మంత్రులు- ఫ్రీ ప్రయాణంపై ఆరా..!
ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వంపై పడే భారంతో పాటు క్షేత్రస్దాయిలో ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్ర మంత్రులు ఇవాళ కర్నాటక వెళ్లి అక్కడి బస్సుల్లో ప్రయాణించారు.
కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ద (కేఎస్ఆర్టీసీ) ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. కర్నాటకతో పాటు తెలంగాణ, ఢిల్లీలోనూ ఇదే పథకం అమల్లో ఉంది. దీంతో ఈ మూడు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అమలు విధానం, క్షేత్రస్దాయి ఇబ్బందులు పరిశీలించి రావాలని సీఎం చంద్రబాబు తాజాగా దీని అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీలో సభ్యులకు సూచించారు. దీంతో వీరు ఇవాళ బెంగళూరు వెళ్లి ఆరా తీస్తున్నారు.

కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నేతృత్వంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణితో కూడిన బృందం ఇవాళ బెంగళూరులో పర్యటించింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డిని, కర్ణాటక ఆర్టీసీ అధికారులను కలిసింది. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి మంత్రులు ఈ పథకం అమలు తీరుతెన్నుల్ని తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణంలో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications