ఈ సారి నిమ్మగడ్డ టార్గెట్ ఆయనే? గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ: తొలిదశ పోలింగ్ వేళ
విజయవాడ: రాష్ట్రంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. మంగళవారం ఆరంభం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,723 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు పూర్తి చేసింది. తెల్లవారు జామున 6:30 గంటలకే పోలింగ్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపును చేపడతారు. మొదట వార్డులు, ఆ తరువాత సర్పంచ్ ఎన్నిక ఫలితాలను వెల్లడిస్తారు. బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అవుతారు. ఈ మేరకు రాజ్‌భవన్.. ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, దాన్ని సజావుగా నిర్వహించడానికి చేపట్టిన చర్యల గురించి ఆయన గవర్నర్‌కు వివరిస్తారని అంటున్నారు. అదే సమయంలో- జగన్ సర్కార్‌పై కొన్ని ఫిర్యాదులు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ఏకగ్రీవ పంచాయతీలు, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యవహారాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని చెబుతున్నారు. ప్రత్యేకించి- కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన కామెంట్ల పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ వద్ద తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చని సమాచారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్నికల కమిషన్ అభాసుపాలవుతోందని, ఓ మంత్రిని తన ఆదేశాలతో కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమంటూ కాకాణి విమర్శించిన విషయం తెలిసిందే.
తనపై కాకాణి చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. ఆయనపై చర్యలను తీసుకోవాలంటూ నిమ్మగడ్డ కోరే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉంచాలంటూ తాను ఆదేశాలను జారీ చేయడానికి గల కారణాలను వివరిస్తారని సమాచాం. దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలను ఇచ్చిందనే విషయాన్ని కూడా గవర్నర్‌కు తెలియజేస్తారని తెలుస్తోంది. ఏకగ్రీవ పంచాయతీల వ్యవహారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరిని సైతం ఈ సందర్భంగా ఆయన బిశ్వభూషణ్ వద్ద ప్రస్తావిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications