చికెన్ తినాలంటే భయపడుతున్న ఏపీవాసులు; బర్డ్ ఫ్లూ కట్టడికి 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు!!
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావటంతో ఏపీలో చాలా ప్రాంతాలలో చికెన్ కొనుగోలు చేయ్యాలంటేనే జనాలు భయపడుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం బర్డ్ ఫ్లూ కట్టడికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరింత విస్తరించకుండా తగు చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ,అటవీ, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో మొత్తం 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కట్టడికి టీమ్ లను రంగంలోకి దించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్ళు మృతి చెందిన క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర ప్రాంతాలలో కూడా బర్డ్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటుంది. ప్రతీ జిల్లాలో పశు సంవర్ధక శాఖాధికారులను అలెర్ట్ చేసింది. ఎక్కడ కోళ్ళ మరణాలు సంభవించినా వెంటనే చర్యల దిశగా అడుగులు వేస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో మరణించిన కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపిన క్రమంలో , ఆ కోళ్లకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకినట్లు ఇది బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ జరిగిందని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ చెప్పటంతో పాటు బర్డ్ ఫ్లూ కట్టడి చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
అయినప్పటికీ ఏపీ వాసుల్లో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ భయం మాత్రం తగ్గటం లేదు. చికెన్ తినాలంటే ఒక్క నెల్లూరు వాసులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల వాసులు కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో చికెన్ ధరలు కిలోకు 200 రూపాయలుగా ఉంది.
ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాల మధ్య చికెన్ ఎక్కువమంది కొనుగోలు చేయకుంటే ధరలు తగ్గే ప్రమాదం ఉందని చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పౌల్ట్రీ పరిశ్రమలు నిర్వహించే వారు సైతం బర్డ్ ఫ్లూ అంటే భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications