ఏపీ రెవెన్యూ శాఖ అరుదైన ఘనత.. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు !
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతి గాంచిన స్కోచ్ అవార్డ్స్-2025లో ఏపీ రెవెన్యూ శాఖకు రెండు అవార్డులు లభించాయి. ఈ విషయాన్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆవిష్కరించిన రెండు కీలక ప్రాజెక్టులకు ఈ అవార్డులు లభించాయి. అందులో..

ORCMS (Online Revenue Court Management System)..
రెవెన్యూ కోర్ట్ కేసులను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే విప్లవాత్మక పద్ధతి. దీనివల్ల కేసులపై సమయానుకూల సమాచారం అందడం, పారదర్శకత పెరగడం జరిగింది.
Resurvey 2.0..
భూసర్వే వ్యవస్థలో సాంకేతికతను అనుసంధానం చేస్తూ, ప్రజలకు ఖచ్చితమైన భూమి రికార్డులు అందించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా తీసుకున్న ప్రాజెక్టు.
ఈ రెండు కార్యక్రమాలు ప్రజల నిత్యజీవితంలో ప్రత్యక్ష ప్రభావం చూపినందుకే స్కోచ్ జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించిందని మంత్రి వెల్లడించారు.
ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం..
వచ్చే నెల ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరగబోయే స్కోచ్ సమ్మిట్‌లో అధికారికంగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులు ఏపీ రెవెన్యూ శాఖకు మాత్రమే కాకుండా, రాష్ట్ర పరిపాలనకు గర్వకారణమని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా ఈ విజయానికి కారణమైన రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకోసం, పారదర్శక పాలన కోసం కష్టపడ్డ ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న రెవెన్యూ సంస్కరణలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం అని మంత్రి అన్నారు. రెవెన్యూ పరిపాలనలో సాంకేతికత వినియోగం, పారదర్శకత, వేగం, బాధ్యతాయుత విధానం.. ఇవన్నీ కేంద్రంగా పెట్టుకొని ఏపీ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని చెప్పారు. ఇ-ఆఫీసు విధానం, డిజిటల్ రికార్డులు, భూ వివాదాల పరిష్కారానికి ఆధునిక పద్ధతులు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications