ఇబ్బంది పెడుతున్నారు: టీ ప్రభుత్వంపై ఏపీ ఫిర్యాదు
హైదరాబాద్: తమ ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల తెలంగాణలో వివక్ష చోటు చేసుకుంటోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పని చేయడం కష్టమని కేంద్రానికి, గవర్నర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అనేక సందర్భాలలో ఏపీ అధికారులు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తమ వాదనలను పూర్త్తిగా విస్మరించడంతో పాటు చిన్నచూపు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్‌లోని జాతీయ నిర్మాణ సంస్థ (నాక్)డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐఏఎస్ శ్యాంబాబ్‌ను నియమించామని, బాధ్యతలు స్వీకరించడానికి ఆయన అక్కడకు వెళితే తీవ్రంగా అవమానించారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

అధికారులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఉద్యమకారుల తరహాలో ఆయనను అడ్డుకున్నారని ఇది దారుణమని కేంద్రానికి పంపిన ఓ లేఖలో ఆరోపించింది. అధికారులు తమ చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉండగా, దానికి పూర్తి విరుద్ధంగా పోలీసులే ఆయనను చార్జి తీసుకోకుండా నిలువరించి వెనక్కి పంపిన తీరు ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని వివరించింది.
పోలీసు వ్యవస్థ ఇలా ఉంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందని, అధికారులు బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారని, ఉమ్మడి రాజధానిలో వారి బాధ్యతలు నిర్వహించడానికి వీలుపడని పరిస్థితి ఏర్పడితే మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురువుతాయని, ఏపీ సర్కారు పేర్కొంది.
ఇది ఒక్కటే కాకుండా ఎంసెట్ వివాదం, ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ పేరు మార్పు తదితర అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, వీటన్నింటిని సామరస్యంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరింది. లేఖ ప్రతిని గవర్నర్‌కూ పంపించింది. కాగా, హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తప్పు పట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications