ఏపీకి పొంచివున్న తీవ్ర వాయుగుండం
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి.
ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. వచ్చే 48 గంటల్లో అంటే- మంగళవారం నాటికి అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో అంటే గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి- ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటిల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పైనా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
నేడు- ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. మిగత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నెల్లిమర్లలో 49.7 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7, తిరుపతిలో 27.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications