ముస్లిం విద్యార్ధులకు ఏపీ వక్ఫ్ బోర్డు గుడ్ న్యూస్..!
దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ పార్లమెంట్ లో దీనికి మద్దతిస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డు తరఫున ముస్లిం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదరికం కారణంగా ప్రతిభ ఉండీ ఉన్నత చదువులు చదువుకోలేక పోతున్న ముస్లిం విద్యార్ధుల్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా ఇంటర్ విద్య అందించాలని ఏపీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.
పదో తరగతి పాసైన ముస్లిం విద్యార్ధులకు రాష్ట్రస్ధాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ప్రతిభావంతుల్ని ఎంపిక చేసి వారికి ఉచితంగా ఇంటర్ విద్యను అందించేందుకు వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. విజయవాడలో తాజాగా జరిగిన వక్ఫ్ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు పూర్తిగా సొంత నిధులతో ముస్లిం విద్యార్ధులకు ఉచిత ఇంటర్ విద్యా పథకాన్ని చేపట్టబోతోంది. ఇలా ఉచితంగా అందించే విద్యలో నీట్, జేఈఈ కోచింగ్ కూడా ఉచితంగానే ఇస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టాలెంట్ టెస్ట్ లో ఎంపికైన విద్యార్ధులకు వారు ఎంచుకున్న కార్పోరేట్ కాలేజీలతో ఇలా ఉచితంగా ఇంటర్ లో చేరే అవకాశం కల్పిస్తారు. ఆయా కాలేజీలకు అయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు స్వయంగా చెల్లించబోతోంది. ఈ మేరకు ఆయా కాలేజీలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. తద్వారా విద్యార్థులపై ఎలాంటి భారం పడకుండానే ఇంటర్ తో పాటు జేఈఈ, నీట్ కోచింగ్ కూడా లభించబోతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. అంటే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన ముస్లిం విద్యార్ధులు వక్ఫ్ బోర్డు నిర్వహించే టాలెంట్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.












Click it and Unblock the Notifications