అమ్మాయిలూ జాగ్రత్త.. కాలం బాగోలేదు..మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ..!
ఏపీలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురంలో ఓ ఇంటర్ విద్యార్థినిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందనే కారణంతో నరేష్ అనే యువకుడు హతమార్చడమే కాకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మరో 14 ఏళ్ల గిరిజన యువతిని ఆరు నెలలుగా ఎంతో మంది రేప్ చేస్తున్నారనే విషయం తాజాగా బయటపడింది. ఈ రెండుఘటనలతో ప్రభుత్వం సైతం ఉలిక్కిపడింది.
ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఇవాళ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న ఆమె.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలూ జాగ్రత్త, కాలం బాగోలేదంటూ శైలజ వ్యాఖ్యానించారు. ఏదైనా తల్లితండ్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంటూ శైలజ వారికి సూచించారు.

పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడం వల్లే ఇంటర్ విద్యార్దినిని యువకుడు హత్య చేశాడని ఆమె తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సీఐని సైతం సస్పెండ్ చేశామన్నారు. అలాగే సత్యసాయి జిల్లా పరిధిలో మరో యువతిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపైనా మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారన్నారు.
ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, ఏదైనా జరిగితే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సూచించారు. 181 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే బాధితులకు ప్రభుత్వం తగిన సాయం అందిస్తుందన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉంటూనే ఏ సాయం కావాలన్నా తమను సంప్రదించాలని రాయపాటి శైలజ యువతులకు సూచించారు.












Click it and Unblock the Notifications