వైఎస్ ఆస్తికే వారసుడు-జగన్ ను సీఎం చేయమని చెప్పలేదు-ఏపీసీసీ ఛీఫ్ సంచలన కామెంట్స్
ఏపీలో వైఎస్ హయాంలో పీసీసీ కార్యవర్గంలో ఉండి ఆ తర్వాత తాజాగా పీసీసీ ఛీఫ్ గా మారిన గిడుగు రుద్రరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పీసీసీ ఛీఫ్ పదవి చేపట్టిన గిడుగు.. ఇవాళ జగన్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా జగన్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వారసుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినట్లు అంతా అనుకుంటున్నా ఆయన కేవలం వైఎస్ ఆస్తికి మాత్రమే వారసుడని పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. వైఎస్ బతికుండగా జగన్ ను సీఎం చేయమని ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పలేదన్నారు. తద్వారా వైఎస్ స్ధానంలో సీఎం పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ పై రుద్రరాజు ఇప్పుడు విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎదిగారని, సీఎం కూడా అయ్యారని గిడుగు గుర్తుచేశారు. వైఎస్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడేనన్నారు.

ఒకప్పటి కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా గురించి కూడా పీసీసీ ఛీఫ్ గిడుగు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగా త్యాగం కారణంగానే కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. వైఎస్ తో పాటు వంగవీటి మోహన రంగా కూడా తాము చనిపోయే వరకూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని గిడుగు గుర్తుచేసుకున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ నేతలుగానే గౌరవిస్తామన్నారు. వైఎస్సార్ వారసత్వంపై తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలాంటి చర్చా లేదు. అయినా కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ ను గుర్తుచేసుకుంటూ గిడుగు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.












Click it and Unblock the Notifications