ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు-డబ్బు కోసమే ఆయన వైసీపీలోకి-షర్మిల ఫైర్..!
వక్ఫ్ బిల్లుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం అంటే ముస్లింలకు వెన్నుపోటు పొడిచినట్లేనని, ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లే లెక్క అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభివర్ణించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారన్నారు. దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. ఇంటికి పిలిపించుకుని తప్పుడు రాతలు రాయించి అదే రిపోర్ట్ ను సబ్మిట్ చేయించారన్నారు. బెయిల్ పై బయట ఉండి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే...ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని ఆమె ప్రశ్నించారు.
వక్ఫ్ సవరణలు తెచ్చి బీజేపీ మళ్ళీ పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని షర్మిల ఆరోపించారు. ఇది ముస్లిం కమ్యూనిటీ మీద,దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడి అన్నారు. బీజేపీ క్రూరత్వానికి నిదర్శనమన్నారు. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లిం లకు మేలు చేసేవి కావని ఆమె తెలిపారు. ముస్లింలకు ఇది తీరని అన్యాయం అన్నారు. అసలు సమస్యే లేదని, అంతా సక్రమంగానే ఉందని, ఇది వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర అని షర్మిల అభివర్ణించారు.

బీజేపీది మతం పేరుతో చిచ్చు పెట్టే రాజకీయమని, మతం,కులం పేరు చెప్పి బీజేపీ విభజన చేస్తుందని షర్మిల తెలిపారు. మతాలను విడగొట్టి ఓటు రాజకీయాలు చేయాలని చూస్తుందన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టీ లబ్ది పొందాలి అని బీజేపీ చూస్తుందన్నారు. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు ఇచ్చిన మద్దతు వల్లేనన్నారు. అందుకే బాబును సూటిగా ప్రశ్నిస్తున్నట్లు షర్మిల తెలిపారు.
బాబు గారు మీకు ముస్లింలు ఓటు వేయలేదా ? అని షర్మిల ప్రశ్నించారు. ముస్లిం లు కూడా ఓటు వేస్తే మీరు గెలవలేదా ?, వైసీపీని వద్దు అనుకోని మీకు ముస్లింలు మీకు ఓటు వేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి అన్నారు. వారికి ఇఫ్తార్ విందు ఇస్తే సరిపోదని, చంద్రబాబువి ఊసర వెల్లి రాజకీయాలని షర్మిల విమర్శించారు. ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లింలకు వెన్ను పోటు పొడిచారన్నారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి పెట్టిన ఇఫ్తార్ లో చంద్రబాబు విషం కలిపారన్నారు.
ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు. ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంత @narendramodi మోడీ అజెండా. పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవ్వాళ బ్లాక్ డే.…
— YS Sharmila (@realyssharmila) April 2, 2025
ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుంటే, ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారని చంద్రబాబు మీద షర్మిల మండిపడ్డారు. ఇది ఊసర వెళ్లి రాజకీయం అనరా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు మీ మొహం ముస్లింలకు ఎలా చూపిస్తారని అడిగారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. దేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసే కుట్రే ఈ సవరణలు అన్నారు. బోర్డు అధికారాలు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
బోర్డ్ లో నాన్ ముస్లిం లను పెట్టడం ఏంటన్నారు. హిందూ,సిక్కు దేవాలయాల బోర్డులో ముస్లిం లను పెడతారా అని నిలదీశారు. వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లింలను పెట్టీ వారికి తీరని ద్రోహం చేశారన్నారు. సవరణలు అన్ని కూడా ముస్లింలకు అన్యాయం చేసేవే అన్నారు. ముస్లిం లా బోర్డ్ పరిధిలో న్యాయం జరిగే పరిస్థితి నుంచి హైకోర్ట్ కి తెచ్చారన్నారు. ఏ సమస్య లేనిది ఇప్పుడు ఈ సవరణ ఎందుకన్నారు.
వక్ఫ్ ఆస్తులను సెంట్రల్ డేటా బేస్ అంటున్నారని, చాలా ఆస్తులకు పత్రాలు లేవని ఆమె తెలిపారు. ఇది వక్ఫ్ భూమి అని అందరికీ తెలుసని, ఇప్పుడు పేపర్లు లేవు అని ఆ భూములు వక్ఫ్ కి కాకుండా పోతాయా అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల్లో కబ్జాలో ఉన్న వాళ్ళు హక్కు దారులు అవుతారట, ఇది పూర్తిగా వక్ఫ్ భూములను కాజేసి కుట్ర కాదా అని నిలదీసారు. కాబ్టి వక్ఫ్ సవరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ హక్కుల కోసం నిలబడుతుందన్నారు. ట్రిబ్యునల్ స్థాయి నుంచి హైకోర్ట్ కి వెళ్లడం అంటే బయట జ్యోక్యం పెరిగినట్లే అన్నారు. ఇది హిందూ-ముస్లింలను వేరు చేసే కుట్ర అన్నారు.
తాను కనిపించడం లేదు అనేది అవాస్తవం అని షర్మిల తెలిపారు. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా అన్నారు. శైలజానాథ్ ఏముంది అని వైసీపీకి వెళ్ళాడో తెలియదన్నారు. అక్కడ అధికారం లేదు, డబ్బు మాత్రమే ఉందన్నారు. ఆ డబ్బు కోసమే పోయి ఉండొచ్చన్నారు. వైసీపీ మా మీద ఫోకస్ పెట్టింది అంటే కాంగ్రెస్ బలోపేతం అయింది అని అర్థమన్నారు. తమ లీడర్లను లాగుతున్నారు అంటే తమకు భయపడుతున్నారని అర్థం అన్నారు. తన కృషి ఫలించింది అని అర్ధం అన్నారు.
సునీత కు తాను ఆ రోజే చెప్పానని, నాన్నకు నువ్వు ఒక్కదానివే అని చెప్పినట్లు గుర్తుచేశారు. న్యాయం కోసం కోట్లాడాలి అని చెప్పానన్నారు. తాను సునీత పక్కన నిలబడతాను అని హామీ ఇచ్చానని, ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్ళు అని తెలిసి కూడా నిలబడ్డానని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సునీత కు న్యాయం కోసం నిలబడ్డానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారిని అవినాష్ ఇంటికి పిలిపించుకున్నాడని, అక్కడ బెదిరించి ,ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని వెల్లడించారు. సంతకం పెట్టించి రిపోర్ట్ ఫైల్ చేశారన్నారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే అవినాష్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు.

బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టే స్వేచ్ఛగా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. సునీతనే వివేకాను హత్య చేయించింది అని కొత్త రిపోర్ట్ రాయించారని, అధికారి తో సంతకం పెట్టించారని విమర్శించారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేస్తే ..ఇక వాళ్ళు బయట ఉండాలా ? జైలు లో ఉండాలా ? అని ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో సునీత తన భర్త అక్కడ లేరన్నారు. అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నాడని, రక్తపు మరకలు అన్ని తుడిపించాడని తెలిపారు.
అన్ని సాక్ష్యాలు అవినాష్ రెడ్డి చేయించాడు అని ఉన్నాయని, అన్ని సాక్ష్యాలు ఉన్నా అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అని రిపోర్ట్ లు రాయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇలా అయితే న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. సునీతకు ఎప్పుడూ న్యాయం జరగాలని అడిగారు. సునీత ప్రాణాలకు భద్రత ఉందా అని ప్రశ్నించారు. అలాగే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు వీడియో లు బయట పెడుతున్నారని, కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుంది అంటున్నారని గుర్తుచేశారు.
వైసీపీ వాళ్ళు విభిన్నంగా రాజకీయం చేస్తున్నారని, ఇది బీజేపీ కుట్రని షర్మిల తెలిపారు. ఇక్కడ కూడా మతాల మధ్య విభజన తేవాలని బీజేపీ చూస్తుందని, ఇక్కడ మతాల మధ్య విభజన పెట్టాలని చూడటం సరికాదని తెలిపారు. ఆంధ్రలో ఇంకా అటువంటి కల్చర్ మనకు రాలేదన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల వాదనతో మనం ఏకీభవించాలన్నారు. ప్రవీణ్ పగడాల ది హత్య అని ఆధారాలు దొరికితే తాను వారిపక్షాన డీజీపీని కలుస్తానన్నారు.












Click it and Unblock the Notifications