ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
Summer season: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. ఇదే తరహా వాతావరణం మరి కొన్నిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తోన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేస్తోన్నారు.

పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడు కానున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా 55 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉంది. రేపు 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,165 ఓ మోస్తరు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నేడు శ్రీకాకుళం- 11, విజయనగరం- 23, పార్వతీపురం మన్యం- 15, అనకాపల్లి- 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు ఎండలో బయటకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం నాడు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు- 37,కడప- 36, తిరుపతి- 34, శ్రీసత్యసాయి- 32, చిత్తూరు- 31, అనంతపురం- 31, అన్నమయ్య రాయచోటి- 30, నంద్యాల- 29, పల్నాడు- 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.
విజయనగరం- 27, కర్నూలు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో 25 చొప్పున, అనకాపల్లి- 24, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 22 చొప్పున మండలాల్లో వడగాల్పుల తీవ్రత రికార్డయింది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు ఉంటుందని విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications