ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త..!!
వేసవి సెలవుల్లో ఏర్పడే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలను తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా స్టార్ లైనర్ బస్సుల సంఖ్యను పెంచనున్నారు.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడ్డాయి. టెన్త్, ఇంటర్మీడియట్ తో పాటు వేర్వేరు సెట్ పరీక్షల షెడ్యూల్స్ విడుదల అయ్యాయి. విద్యార్థులు పరీక్షల కోసం సమాయత్తమౌతోన్నారు. ఈ పరీక్షలు ముగిసిన తరువాత సెలవుల సందడి ఆరంభమౌతుంది. వేసవి సెలవుల్లో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి ప్రయాణికులు సన్నద్ధమౌతుంటారు.

నాన్ ఏసీ స్లీపర్ సర్వీసులు..
వేసవి సెలవుల రద్దీని అధిగమించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్టార్ లైనర్ 2+1 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయా సర్వీసుల సంఖ్యను మరింత పెంచనున్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల మధ్య కూడా స్టార్ లైనర్ బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు.

ఇప్పుడున్న సర్వీసులు ఇవే..
ప్రస్తుతం మంత్రాలయం-బెంగళూరు, కడప-విజయవాడ, కడప-హైదరాబాద్, ఒంగోలు-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం, నెల్లూరు-హైదరాబాద్, నెల్లూరు-బెంగళూరు మధ్య స్టార్ లైనర్ నాన్ ఏసీ స్టీపర్ బస్సులు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సమ్మర్ సీజన్ లో మరిన్ని నగరాలు, జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను ప్రవేశపెట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు.

తిరుపతికీ..
ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వేసవి సీజన్ లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులను ఎప్పటి నుంచి నడిపించాలనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నారు.

గ్రీన్ సప్తగిరి..
గ్రీన్ సప్తగిరి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించనున్నారు ఆర్టీసీ అధికారులు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి. వేసవి సెలవుల నాటికల్లా ఆయా బస్సులను ప్రయాణికులకు తమ సేవలను అందించడానికి రెడీ కానున్నాయి. జీరో ఎమిషన్ బస్సులు అవి. డీజిల్ కు బదులుగా విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడుస్తాయి.












Click it and Unblock the Notifications