APSRTC: పుదుచ్చేరికి వీకెండ్ స్పెషల్ సర్వీస్: ఛార్జీ, రిజర్వేషన్ వివరాలివే
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.
తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇదివరకే అన్నమయ్య రాయచోటి జిల్లాలోని మదనపల్లి, గుంటూరు నుంచి ఊటీకి ఈ స్పెషల్ బస్సును ప్రవేశపెట్టింది. దీనికి మంచి ఆదరణ లభించడంతో ప్రత్యేక బస్ సర్వీసుల సంఖ్యను పెంచింది కూడా.

మదనపల్లి నుంచి బెంగళూరు, మైసూరు రూట్‌లో ఊటీకి బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ. ఆ తరువాత కడప నుంచి గోవాకు ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఊటీ, గోవాకు ప్రత్యేకంగా బస్సులను నడిపించిన దాఖలాలు లేవు. ప్రయాణికుల నుంచి అందుతోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అరుణాచలం, వేలాంకిణి, ఊటీ, గోవా వంటి ఆధ్యాత్మక-పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెట్టింది. ప్రయాణికుల నుంచి ఆదరణ అందుకుంటోంది.
ఇదే ఊపులో పుదుచ్చేరికి కూడా ప్రత్యేక బస్ సర్వీసులను నడిపించబోతోంది. ఈ నెల 10వ తేదీన తొలి సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. పుదుచ్చేరి వీకెండ్ సర్వీస్ పేరుతో ఈ బస్సును నడిపించనుంది ఆర్టీసీ. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ఈ బస్సు నెల్లూరు నుంచి పుదుచ్చేరికి బయలుదేరుతుంది. ఆదివారం తెల్లవారు జామున 6 గంటలకు పుదుచ్చేరికి చేరుకుంటుంది.
మళ్లీ ఆదివారం రాత్రి 9 గంటలకు పుదుచ్చేరి నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు నెల్లూరుకు చేరుకుంటుంది. గుమ్మిడిపూండి, చెన్నై, చెంగల్పట్, మధురాంతకం, మేల్‌మరువత్తూర్, థిండివనం మీదుగా ఈ బస్సు రాకపోకలు సాగిస్తుంది. రానుపోను బస్ ఛార్జీని 1,530 రూపాయలుగా నిర్ధారించారు. పుదుచ్చేరికి ఏపీఎస్ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications