ఏపీలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్ మెంట్ - ఇలా నమోదు చేసుకోండి..!
కేంద్రం రక్షణశాఖ పరిధిలో చేపడుతున్న ఆర్మీ అగ్నివీరుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం వెబ్ సైట్, ఇతర వివరాలను విడుదల చేసింది.
అగ్నివీర్ పథకం కింద ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తుల నమోదుకు ఏప్రిల్ 10ని చివరి తేదీగా ప్రకటించారు. ఇందులో ఒక అభ్యర్థి ప్రస్తుతం రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) ద్వారా నియామకాలు చేపడతారు.

అయితే మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో ఈ ఆన్ లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతోంది. అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎన్‌సీసీ 'ఎ', 'బి' & 'సి' సర్టిఫికెట్ కలిగిన వారికి, అలాగే విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అలాగే అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటిఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కర్నల్ పునీత్ కుమార్ తెలిపారు.
ఏపీలోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, అగ్నివీర్‌గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications