జగన్ పార్టీ ఆందోళన: అసెంబ్లీ వాయిదా, క్యాంటీన్లు బంద్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల ఆందోళనతో మంగళవారంనాడు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ అట్టుడికింది. హత్యా రాజకీయాలపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైసిపి సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎంతగా సర్ది చెప్పినా వారు వినలేదు.
ప్రతిపక్ష సభ్యులు వినకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రేపు బుధవారంనాడు 344 నిబంధన కింద చర్చకు అనుమతిస్తానని స్పీకర్ చెప్పినా వైసిపి సభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులపై తెలుగుదేశం సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి విరుచుకుపడ్డారు. దాడులు జరిగాయంటూ వైసిపి తప్పుడు లెక్కలు చూపుతోందని ఆయన ఆరోపించారు. అవాస్తవాలతో ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. హత్యా రాజకీయాలకు వైసిపి మూలమని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో తమ పార్టీ కార్యకర్తల హత్యలు జరిగాయని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రభావం ఆంధ్రప్రదేశ్ శాసనసభపై పడింది. అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో క్యాంటీన్లు మూసివేశారు. సర్వే కోసం సిబ్బంది సెలవు పెట్టడంతో కాంటీన్లు బంద్ చేశామని నిర్వహకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications