వ్యూహాత్మకంగా టిపై చర్చ: బాబు నో, చించి స్పీకర్ పైకి
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన రాష్ట్ర శాసన సభలో వ్యూహాత్మకంగా చర్చను ప్రారంభింప చేశారని అంటున్నారు. టి డ్రాఫ్ట్ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం నుండి అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ పలుమార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ప్రారంభమైంది.
స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తన ఛాంబర్ నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. ఈ సమయంలో సభలో శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు - సభలో ప్రతిపాదించిన తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ను కోరారు.

దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైర్హాజరు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాకపోవడంతో మల్లు భట్టి, శ్రీధర్ బాబులు వ్యూహాత్మకంగా తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు పైన చర్చను ప్రారంభింప చేసినట్లుగా కనిపిస్తోంది.
తీవ్ర గందరగోళం మధ్యనే శ్రీధర్ బాబు ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క - చర్చను ప్రారంభించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు అందుకు నిరాకరించినట్లుగా తెరాస ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే, చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమవగా అసెంబ్లీ వాయిదా పడిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. చంద్రబాబు సభలో ఉన్నప్పటికీ లేరని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముసాయిదా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం వైపుకు విసిరేశారు. చించివేసిన విసిరేసిన ప్రతులు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కపై కూడా పడ్డాయి. సీమాంధ్ర శాసనసభ్యులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రతులు చించి వేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి సభను మంగళవారానికి వాయిదా వేశారు.
సభ వాయిదా పడిన అనంతరం తెరాస ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... శ్రీధర్ బాబు చర్చకు ఆమోదం తెలపడంతో డిప్యూటీ స్పీకర్ చంద్రబాబు పేరు తీసుకున్నప్పటికీ ఆయన నిరాకరించారని చెప్పారు. ముసాయిదా బిల్లు పైన చర్చ ప్రారంభమైనట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. కాగా, చర్చ ప్రారంభమైందని తెలంగాణ మంత్రులు అంటుండగా, చర్చ ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు అంటున్నారు.












Click it and Unblock the Notifications