ఆ రైతుల ఖాతాల్లో రూ 25 వేలు జమ.. మంత్రి కీలక ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా తుఫాను కారణంగా నష్ట పోయిన రైతుల కు పరిహారం పైన ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా జరిగిన నష్టం పైన వివరాలను సేకరించింది. మొత్తంగా రూ 5,245 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కేంద్ర సాయం కోరుతూ నివేదిక పంపింది. ఇదే సమయంలో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ 25 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం జమ పైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు.
మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వం.. అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి 3000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇచ్చి పంపించామని చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో హెక్టారుకు 20వేల రూపాయల నష్టపరిహారం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం రూ.17 వేలకు తగ్గించిందని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 25 వేల రూపాయలు చేశామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీ సర్వే వల్ల చాలా సమస్యలు ఉత్పన్న మయ్యాయని తెలిపారు. వారు చేసిన రిసర్వే వల్ల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

కాగా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు అతి ప్రధానమైన సమస్య గోదావరి డెల్టా కాలువలని తెలిపారు. ఈ డెల్టా పంట కాలువలు పూడుకుపోవడం వల్ల వ్యవసాయాలు పాడవుతున్నాయని చెప్పారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని నీటిపారుదల వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వ ఆలోచిస్తోందని చెప్పారు. దీని కోసం సమగ్ర సర్వే చేసేందుకు రూ.12 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. టిడ్కో ఇళ్ళను అయిదు సంవత్సరాలు మరుగున పెట్టింది గత వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. మార్చ్‌లోగా అన్ని ఇళ్ళను పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు. తుఫాను పంట నష్టపరిహారం అంచనాలు వచ్చాయని.. వాటిని కేంద్రానికి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకారంతో త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications