వారితో చర్చలేమిటి: పవన్ కళ్యాణ్ తీరుతో బాధపడ్డ టీడీపీ, 'జగన్‌కు ముహూర్తం ఎందుకు'
రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపడం తమను బాధించిందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రం గురించి ఆలోచించే పవన్ కాంగ్రెస్‌తో చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. ఇది బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని తగులబెట్టిన వారితో చర్చలు ఏమిటని ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లోను తాము భారతీయ జనతా పార్టీతోనే వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సోము వీర్రాజుకు ఆ స్థాయి లేదు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి లేదని అయ్యన్న అన్నారు. ఆయన చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. బీజేపీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పారు.

రాజీనామాల కోసం ముహూర్తాలు ఎందుకు
వైసీపీ ఎంపీలు ఏప్రిల్ ఆరున రాజీనామా చేస్తారనే విషయమై అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ.. తమ పార్టీ ఎంపీల రాజీనామా పెద్ద విషయం కాదన్నారు. కానీ తమకు ఏపీ అభివృద్ధే ముఖ్యమని చెప్పారు. రాజీనామాల కోసం జగన్‌కు ముహూర్తాలు ఎందుకని ప్రశ్నించారు.

బీజేపీ మిత్రపక్షమైనా
ఏపీ అభివృద్ధి, విభజన హామీల విషయంలో బీజేపీ తమకు మిత్రపక్షమైనా తాము రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి నారాయణ వేరుగా అన్నారు. చివరి బడ్జెట్ వరకు తాము ఎదురు చూశామని చెప్పారు. అందుకే ఇప్పుడు ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు.

మధ్యంతర ఎన్నికలు రావని తెలిసే
మధ్యంతర ఎన్నికలు రావని తెలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా నాటకాలకు తెరలేపిందని నారాయణ ఆరోపించారు. గత ఏడాది రాజీనామా చేస్తామని చెప్పారని, అది ఏమయిందని ప్రశ్నించారు. వైసీపీకి నిజాయితీ లేకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.












Click it and Unblock the Notifications