EPFO New Rules: జులై 1 నుంచి 'కనీస నిల్వ' తప్పనిసరి!
ఉద్యోగికి కష్టకాలంలో కొండంత అండగా నిలిచేది 'ఈపీఎఫ్' (EPF) నిధి. రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. అయితే, ప్రస్తుత కాలంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంటోందని ఈపీఎఫ్‌వో గుర్తించింది.
ఈ నేపథ్యంలో, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్‌వో తన ఐటీ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలపై ప్రతి ఉద్యోగీ అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఇకపై కనీస నిల్వ నిబంధన..
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలో ఉన్న నిల్వలను ఉద్యోగులు తమకు నచ్చినప్పుడు పాక్షికంగా విత్ డ్రా చేసుకునే వీలుంది. కానీ, జులై 1 నుంచి ఈ విధానంలో కీలక మార్పు రాబోతోంది. పీఎఫ్ ఖాతాలో కనీసం 25% నిల్వను తప్పనిసరిగా ఉంచాలనే నిబంధనను ఈపీఎఫ్‌వో తీసుకువస్తోంది. అంటే, మీరు ఎంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలనుకున్నా, మీ మొత్తం పీఎఫ్ నిధిలో (ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీతో కలిపి) 25% నిల్వ ఉంచి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. తద్వారా పదవీ విరమణ సమయానికి ఉద్యోగి ఖాతాలో కొంత నిధి భద్రంగా ఉంటుందని ఈపీఎఫ్‌వో భావిస్తోంది.
సాంకేతికతతో వేగవంతమైన సేవలు..
కేవలం నిబంధనలే కాదు, పాతబడిన ఐటీ వ్యవస్థను కూడా ఆధునీకరించేందుకు ఈపీఎఫ్‌వో సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరచడంతో పాటు, క్లెయిమ్ పరిష్కార ప్రక్రియను పూర్తిగా ఆటోమేషన్ చేస్తోంది. యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ఆటోమేషన్ ప్రక్రియ పూర్తయితే, దరఖాస్తు చేసిన వెంటనే నగదు నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ఈ మార్పుల కోసం ప్రస్తుతం పీఎఫ్ పాస్‌బుక్, మెంబర్ పోర్టల్ సేవలను జూన్ 30 వరకు నిలిపివేసింది. జులై 1న కొత్త వ్యవస్థతో పాటు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వడ్డీ కూడా జమ కానుంది.
విత్ డ్రా లిమిట్స్ పెంపు.. ఇక సులభతరం!
కొత్త నిబంధనల ప్రకారం క్లెయిమ్ దరఖాస్తులను కూడా సులభతరం చేస్తున్నారు. కేటగిరీల వారీగా విత్ డ్రా లిమిట్స్ పెంచారు. అనారోగ్యం, విద్య, వివాహం కోసం గతంలో ఉన్న పరిమితుల కంటే ఇప్పుడు ఎక్కువసార్లు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇల్లు కొనుగోలు, నిర్మాణం లేదా లోన్ చెల్లింపుల కోసం గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఉండేది, దీన్ని ఇప్పుడు ఐదుసార్లకు పెంచారు.
కొత్త పథకాల రాక..
ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995 స్థానంలో కొత్తగా 'EPF-2026', 'EPS-2026' పథకాలను తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ట్రస్టీ బోర్డు ఇప్పటికే వీటికి ఆమోదం తెలపగా, ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయి. మొత్తానికి, జులై 1 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి నిర్వహణ మరింత వేగంగా, పారదర్శకంగా మారనుంది. అదే సమయంలో, మీ భవిష్యత్ అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలో కొంత నిధిని పొదుపుగా ఉంచుకోవడం కూడా తప్పనిసరి కానుంది.














Click it and Unblock the Notifications