భారత్ 'ఆపరేషన్ సింధూర్' డాక్యుమెంటరీ ఓ డ్రామా: పాకిస్థాన్ ఆర్మీ సంచలనం
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ లో భారత ఆర్మీ సాధించిన విజయాలు, వ్యూహాలను ప్రస్తావిస్తూ 'ఆపరేషన్ సింధూర్' పై డాక్యూమెంటరీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ 'ఆపరేషన్ సింధూర్' డాక్యుమెంటరీని భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి విడుదల చేసింది. Declassified: Operation Sindoor అనే పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీపై పాకిస్థాన్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఒక్క సైడ్ మాత్రమే చూపించారని.. యుద్ధానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో అందులో లేదని స్పష్టం చేసింది. డాక్యూమెంటరీలో డ్రామానే ఎక్కువగా ఉందని.. వారికి కావాల్సిన విధంగా డాక్యూమెంటరీని రూపొందించారని వాస్తవాలు లేవని మండిపడింది. ఈ మేరకు పాకిస్థాన్ కు చెందిన మిలిటరీ మీడియా వింగ్ అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ డాక్యూమెంటరీపై తన స్పందనను తెలియజేసింది.

ఆపరేషన్ సింధూర్ లో విజయం తమదేనని భారత్ సైన్యం చెప్పుకోవడంలో వాస్తవం లేదని పాకిస్థాన్ ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ డాక్యుమెంటరీలో సీనియర్ మిలిటరీ అధికారులు, రాజకీయ ప్రముఖులు దాదాపు 88 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ ను గుర్తు చేసుకుంటూ ఉన్నట్లు స్పష్టమైంది. ఈ డాక్యుమెంటరీలో పాకిస్థాన్ పై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(NSA) అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సహనాన్ని బలహీనతగా భావించరాదని.. ఎలాంటి పరిణామాలు ఎదురైనా భారత్ ఎప్పుడూ రిస్క్ లు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుందని.. బలంగా ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ధీటుగా స్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాలకు చూపామని అజిత్ దోవల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications