టిడిపిని నటుడే స్థాపించాడు: బాహుబలి-కంచెలపై చంద్రబాబు ప్రశంస
హైదరాబాద్: బాహుబలి, కంచె చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం లభించింది. కంచె ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలకు ఏపీ శాసన సభ మంగళవారం సాయంత్రం అభినందనలు తెలిపింది. బాహుబలి, కంచె చిత్రాల బృందాన్ని అభినందించింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషకరమన్నారు. ఇటీవలే రాజమౌళికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. ఇక, రెండో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొని కంచె అనే సినిమాను బాగా తీశారని చెప్పారు.

సమాజానికి అతిపెద్ద అడ్డంకి కులం, మతం, ప్రాంతం అన్నారు. కులాన్ని ఆధారంగా తీసుకొని కంచె సినిమాను అద్భుతంగా తీశారన్నారు. బాహుబలి, కంచె వంటి మంచి చిత్రాలు భవిష్యత్తులోను రావాలని ఆకాంక్షించారు.
ఈ రెండు చిత్రాలకు అవార్డులు రావడం మనమంతా గర్వించదగ్గ విషయమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఓ నటుడు స్థాపించారని చెప్పారు. సినిమాకు, పార్టీకి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. అనంతరం బాహుబలి, కంచె చిత్రాలను అభినందిస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రకటన చేశారు. ఆ తర్వాత సభ బుధవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications