వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి..
భూమాత ఉగ్రరూపం, ప్రకృతి ప్రకోపం, నేలమట్టమైన భవనాలు.. శ్మశానాలను తలపిస్తున్న శిథిలాల.. ఎటు చూసిన మృత్యువు విలయతాండవం.. ఇది వెనిజువెలా తాజా పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న ఆ దేశాన్ని వరుస భూకంపాలు కోలుకోలేని దెబ్బతీశాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గజగజ వణికిపోయారు. రాజధాని కారకస్, మరాకే నగరాల సమీపంలో భూమి కంపించడంతో ఇప్పటికే శిథిలాల అంచున ఉన్న భవనాలు మరింత దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, బుధవారం వచ్చిన జంట భూకంపాల విధ్వంసం వెనిజువెలా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా నిలిచింది.
శిథిలాల కింద అదృశ్యమైన 50 వేల మంది
తాజా భూకంపంతో ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. కారకస్ నగరం, లా గువేరా రాష్ట్రం ఇప్పుడు శిథిలాల దిబ్బలుగా మారాయి. రెస్కూ ఆపరేషన్ కు తాజా ప్రకంపనలు అడ్డంకిగా మారాయి. తొలగించిన శిథిలాలపై మళ్లీ పెద్ద పెద్ద గోడలు పడగా పరిస్థితి ఘోరంగా తయారైంది. బుధవారం సాయంత్రం వచ్చిన భూకంపాల వల్ల ఇప్పటివరకు 920 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించగా, 3,360 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, దాదాపు 50 వేల మంది ఆచూకీ గల్లంతైంది. వీరంతా కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని, సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవస్థలు బలహీనపడటంతో, నిరాశ్రయులైన వేలాది మందికి కనీసం ఆశ్రయం కల్పించలేని దుస్థితి నెలకొంది.
6.7 బిలియన్ డాలర్ల ఆర్థిక సంక్షోభం
ఐక్యరాజ్యసమితి (UN) తాజా అంచనాల ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు వల్ల వెనిజువెలాకు సుమారు 6.7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.63,000 కోట్లు) ప్రత్యక్ష నష్టం వాటిల్లింది. పరోక్ష ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశానికి, ఇప్పుడు తోడైన ఈ భారీ ఆర్థిక భారం కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిలిప్పీన్స్‌లోనూ కదిలని భూమి
ఒకవైపు వెనిజువెలాలో విషాదం కొనసాగుతుండగా, అటు దక్షిణ ఫిలిప్పీన్స్‌లోనూ శుక్రవారం భూకంపం కలకలం రేపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైనట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో ఉండటంతో భారీ విధ్వంసం తప్పినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్ల ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం వెనిజువెలాలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ దేశాల నుంచి సాయం అందుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాల కొరత పెద్ద సవాలుగా మారింది. వేలాది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచ దేశాలు చేయి అందించాలని ఐరాస పిలుపునిచ్చింది.














Click it and Unblock the Notifications