ఆ గ్రహం ఓ రత్న గర్భ: ఎక్కడపడితే అక్కడ కెంపులు, నీలాలు..!!
ఆ గ్రహంపై జీవరాశి ఆనవాళ్ల కోసం సుదీర్ఘ కాలంగా అన్వేషణ సాగిస్తూ వస్తోన్న పర్సర్వరెన్స్ రోవర్.. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఒక అద్భుతమైన రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. భూమిపై అత్యంత విలువైనవిగా భావించే కెంపులు, నీలాలు, వజ్రాలు, వాటిల్లో రంగులకు కారణం అయ్యే కోరండం అనే అరుదైన ఖనిజం.. ఈ రోవర్ సేకరించిన రాతి నమూనాల్లో లభించాయి. ఈ రెడ్ ప్లానెట్ ఉపరితలంపై ఈ రకమైన ఖనిజాన్ని గుర్తించడం మానవ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
అదే అంగారక గ్రహం. దీని ఉపరితలంపై ఉండే జెజెరో క్రేటర్ అంచులలో విసిరేసినట్లు పడి ఉన్న మూడు రకాల రాళ్లను పర్స్వరెన్స్ రోవర్ ప్రత్యేకంగా పరిశీలించింది. ఈ రాళ్లలో కోరండంతో పాటు కెంపులకు మాత్రమే సొంతమైన ముదురు ఎరుపు, గులాబీ రంగును ఇచ్చే క్రోమియం మూలకం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీకి చెందిన జియోకెమిస్ట్ ఆన్ ఒల్లిలా నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించింది.

సాధారణంగా గ్రహాల భౌగోళిక శాస్త్రం ప్రకారం మార్స్ పై కోరండం వంటి స్ఫటికాలు ఏర్పడటం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. భూమిపై ఈ ఖనిజం సహజ సిద్ధంగా ఉద్భవించడానికి భూగర్భంలో విపరీతమైన ఉష్ణోగ్రతలతో పాటు బలమైన టెక్టోనిక్ మార్పులు అవసరమౌతాయి. అంతేకాకుండా.. అల్యూమినియం మోతాదు అత్యధికంగా ఉండి, సిలికాన్ దాదాపుగా లేని వాతావరణంలోనే కోరండం ఏర్పడుతుంటుంది. ఇది సహజసిద్ధ ప్రక్రియ.
అంగారకుడిపై సిలికాన్ సమృద్ధిగా ఉండే రాళ్ల మధ్యనే ఈ ఖనిజం లభించడం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడ లభించిన మూడు రాళ్లను శాస్త్రవేత్తలు హాంప్డన్ రివర్', కాఫీ కోవ్', స్మిత్స్ హార్బర్ అనే పేర్లతో పిలుస్తున్నారు. నాసా పర్సర్వరెన్స్ రోవర్ వీటిని అత్యంత శక్తిమంతమైన లేజర్ అంటే.. టైమ్ రిజాల్వ్డ్ లుమినిసెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా క్షుణ్ణంగా విశ్లేషించింది. ఈ అత్యాధునిక లేజర్ కిరణాలు రాళ్లలోని పరమాణువులను సైతం ఉత్తేజితం చేయగలవు.

అలా చేయడం వల్ల వెలువడే కాంతి తరంగాల ఆధారంగా అందులో క్రోమియంతో కూడిన కోరండం స్పటికాలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను రోవర్ సేకరించింది. అంగారక గ్రహంపై ఈ అరుదైన ఖనిజం ఏ విధంగా ఏర్పడిందనే విషయంపై శాస్త్రవేత్తల్లో సరైన సమాధానం ఉండట్లేదు. ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. బిలియన్ల సంవత్సరాల క్రితం జెజెరో క్రేటర్ పుట్టుకకు కారణమైన ఓ భారీ ఉల్కాపాతం వల్లే ఈ ఖనిజం అక్కడ ప్రాణం పోసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
అతి తీవ్రమైన గ్రహశకలాల తాకిడి కారణంగా ఆ క్రేటర్ వద్ద ఒక్కసారిగా విపరీతమైన వేడి, అపారమైన పీడనం పెరిగి, భూమి అంతర్భాగంలో జరిగే భౌగోళిక ప్రక్రియల వంటి ప్రత్యేక వాతావరణం అక్కడ ఏర్పడి ఉండొచ్చని భావిస్తోన్నారు. భూమి మీద దొరికే అసలైన రత్నాల తరంగ ధైర్ఘ్యాలతో రోవర్ పంపిన కాంతి సిగ్నల్‌ను పోల్చి చూసినప్పుడు నమ్మశక్యం కాని సారూప్యతలు వెలుగులోకి వచ్చాయి.

స్మిత్స్ హార్బర్ రాతి నమూనా విడుదల చేసిన కాంతి.. దాదాపు మూడు మిల్లీసెకన్ల పాటు ప్రసరించింది. ఇది భూమిపై సహజసిద్ధంగా లభించే మేలిమి కోరండం మెరుపుతో నూటికి నూరు శాతం సరిపోలడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ రాతిపలకల్లో సూక్ష్మ రూపంలో ఉన్న కోరండం కణాలు అక్కడి రహస్యాలను ఛేదించడానికి ఎంతో కీలకంగా మారాయి. ఈ ప్రత్యేక రాతి నమూనాలను భూమిపైకి సురక్షితంగా తీసుకువచ్చి పరిశోధించినప్పుడే వీటి వెనుక ఉన్న అసలైన విషయాలు వెల్లడవుతాయి. మార్స్ శాంపిల్ రిటర్న్ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.














Click it and Unblock the Notifications