రోడ్లపైకి సరికొత్త ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సులు! ఇక భాగ్యనగరమంతా హాయిగా చుట్టేయొచ్చు!
హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు అలరించిన డబుల్ డెక్కర్ బస్సుల వైభవం మళ్లీ సరికొత్త హంగులతో తిరిగొస్తోంది. నగర అందాలను ఓపెన్ టాప్ బస్సుల్లో కూర్చుని వీక్షించే సరికొత్త అనుభూతిని భాగ్యనగర వాసులకు, పర్యాటకులకు అందించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) సిద్ధమైంది. సరికొత్తగా రెండు ఎలక్ట్రిక్ ఓపెన్-టాప్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, ప్రస్తుతం హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) వద్ద ఉన్న బస్సులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుని నగర పర్యాటకాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.
పైకప్పుపై పర్యాటకం.. కింద పూర్తి ఏసీ కూలింగ్!
త్వరలోనే నగర రోడ్లపైకి రానున్న ఈ కొత్త డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులకు సరికొత్త రాయల్ ఫీలింగ్‌ను అందించనున్నాయి. ఈ బస్సుల అప్పర్ డెక్ ఓపెన్-టాప్‌గా ఉంటుంది. అక్కడ కూర్చుని పర్యాటకులు నగరపు చారిత్రక భవనాలు, అందమైన రోడ్లను నేరుగా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అదే సమయంలో కింలోయర్ డెక్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ (A/C) క్యాబిన్‌గా అందుబాటులో ఉంటుంది. పర్యాటకుల సౌకర్యార్థం గైడ్ మైక్రోఫోన్ సిస్టమ్, ఎంటర్ టైన్ కోసం స్పీకర్లు, మొబైల్ యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు, ఆకట్టుకునే ఎల్‌ఈడీ లైటింగ్ వంటి అత్యాధునిక హంగులను ఈ బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు.

రూట్ మ్యాప్ రెడీ.. ఈ స్థలాలన్నీ చుట్టేయొచ్చు!
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వద్ద ఇప్పటికే రూ. 12 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ పరిధిలోకి మార్చాలని ఇప్పటికే లేఖ రాయగా, అధికారుల తనిఖీ కూడా పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ఈ బస్సులు పర్యాటక శాఖ చేతికి రానున్నాయి. ప్రస్తుతం నెక్లెస్ రోడ్, వేవ్ రాక్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, గోల్కొండ కోట వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల మార్గాల్లో ఈ బస్సులను నడపడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు తిరిగే ఈ ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో పొల్యూషన్ లేని హాయి ప్రయాణాన్ని అందించనున్నాయి.
నిజాం కాలం నాటి జ్ఞాపకాలకు పునర్వైభవం!
హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులతో దశాబ్దాల అనుబంధం ఉంది. చివరిగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 'నిజాం స్టేట్ రైల్వే-రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్' ఆధ్వర్యంలో తొలిసారిగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో తిరిగాయి. ఆ తర్వాత 1946లో ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన బస్సులను హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ ఇక్కడ అసెంబుల్ చేసి నడిపింది. అయితే కాలక్రమేణా నిర్వహణ ఖర్చులు పెరగడం, స్పేర్ పార్ట్స్ దొరక్కపోవడంతో 2003 నాటికి ఈ బస్సు సేవలను పూర్తిగా నిలిపివేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, మళ్లీ ఇప్పుడు సైబర్ సిటీ రోడ్లపై ఓపెన్-టాప్ డబుల్ డెక్కర్ బస్సులు మెరవబోతుండటంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
