భారీవర్షాలతో విజయవాడ కొండ ప్రాంతాలపై మంత్రుల అలెర్ట్.. ఈ జిల్లాలలో స్కూల్స్ బంద్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులను పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ప్రభావిత ప్రాంతాల మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా అదనపు సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడలోని కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. అమరావతి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

ఇదే సమయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య వస్తే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అంగన్ వాడీ కేంద్రాలకు కూడా తీవ్ర వర్షాలు ఉన్న ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు.
అంతేకాదు తాజాగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు ఉందని పేర్కొన్నారు. అంతేకాదు తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.













Click it and Unblock the Notifications
