Screen Guard: టెంపర్డ్ గ్లాసులపై కేంద్రం కఠిన రూల్స్! పెరగనున్న ధరలు
ఈ రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటే సరిపోదు, దాని స్క్రీన్‌ను కాపాడుకోవడానికి వెంటనే టెంపర్డ్ గ్లాస్ వేయించడం ప్రతీ ఒక్కరికీ అలవాటు. రోడ్డు పక్కన రూ. 50, రూ. 100 కే దొరికే లోకల్ గ్లాసుల నుంచి వేల రూపాయలు ఉండే బ్రాండెడ్ స్క్రీన్ గార్డుల వరకు మార్కెట్లో బోలెడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ నాసిరకం టెంపర్డ్ గ్లాసుల ముచ్చటకు ఇక కాలం చెల్లనుంది. మొబైల్ స్క్రీన్ గార్డులపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త నాణ్యతా అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఇకపై ఏది పడితే అది అమ్మితే కుదరదు.. నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే భారత మార్కెట్లో విక్రయించాలనే కఠిన నిబంధనను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తీసుకొచ్చింది.
ఏప్రిల్ 1, 2027 నుంచి రూల్ మారబోతోంది!
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21న విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లను తప్పనిసరి బీఐఎస్ (BIS - Bureau of Indian Standards) రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2027 నుంచి విక్రయించే ప్రతీ స్క్రీన్ ప్రొటెక్టర్ ఖచ్చితంగా 'IS 19348:2025' నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాలి. దేశీయంగా తయారుచేసే కంపెనీలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రొడక్టులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు, పరీక్షలు దాటి వచ్చిన గ్లాసులకు మాత్రమే ఇండియన్ మార్కెట్లో అనుమతి ఉంటుంది. కంపెనీలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించేందుకు వీలుగా దాదాపు ఆరు నెలలకు పైగా సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది.

ఏమిటీ కొత్త 'IS 19348:2025' క్వాలిటీ టెస్ట్?
ఈ కొత్త నిబంధనల ప్రకారం స్క్రీన్ గార్డ్ తయారీలో వాడే గ్లాస్ నాణ్యత, దాని స్పష్టత (కలరిటీ), ఫోన్ పడిపోయినప్పుడు స్క్రీన్ కు ఇచ్చే సపోర్ట్, అదనపు ఫీచర్లు, ప్యాకేజింగ్ ప్రమాణాలను BIS బృందం నిశితంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే చాలా తక్కువ ధర గ్లాసులు ఫోన్ స్క్రీన్‌ను కాపాడకపోగా, టచ్ రెస్పాన్స్‌ను తగ్గించి, కళ్లకు హాని కలిగిస్తున్నాయి. కొత్త క్వాలిటీ గైడ్‌లైన్స్ రావడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన, అత్యుత్తమ సేఫ్టీని ఇచ్చే టెంపర్డ్ గ్లాసులు మాత్రమే లభిస్తాయి.
జేబుకు చిల్లు పడటం ఖాయమా?
కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ధరలు పెరుగుతాయని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఈ కొత్త మార్పుల వల్ల జేబు భారం పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతీ టెంపర్డ్ గ్లాస్ మోడల్‌ను BIS ల్యాబ్‌లలో టెస్టింగ్ చేయించడం, ల్యాబ్ సర్టిఫికేషన్ పొందేందుకు కంపెనీలకు అదనపు ఖర్చవుతుంది. రోడ్డు పక్కన లభించే రూ. 50-100 బిఐఎస్ లేని చౌక గ్లాసులు మార్కెట్ నుంచి మాయమైపోతాయి. ఈ టెస్టింగ్ ఖర్చులు, నాణ్యమైన గ్లాస్ వినియోగం వల్ల భవిష్యత్తులో మొబైల్ స్క్రీన్ గార్డుల ధరలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కేంద్రం టెంపర్డ్ గ్లాసులను పూర్తిగా నిషేధించలేదని, కేవలం నాణ్యతను మాత్రమే కట్టడి చేస్తోందని స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
