రేపటినుండే స్మార్ట్ రేషన్ కార్డులు.. హోలోగ్రామ్ నుంచి QRకోడ్ వరకు సూపర్ సెక్యూరిటీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు రేషన్ కార్డులు పేపర్ ప్రింటింగ్ రూపంలో ఉండేవి. పేపర్ రూపంలో ఉన్న రేషన్ కార్డులు చినిగిపోవడం, పాడైపోవడం వంటివి జరిగేవి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకేంద్రాలకు వాటిని చేరవేసింది.
అత్యంత భద్రత కలిగిన టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులు
ఈ ఆహార భద్రత కార్డులను అత్యంత భద్రత కలిగిన టెక్నాలజీతో రూపొందించింది. రేషన్ కార్డులలో నకిలీలను నివారించేలా తొమ్మిది రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేశారు. బ్యాంకు నోట్లు, పాస్పోర్ట్ లు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాలలో ఉపయోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. నకిలీలను వివరించడానికి కావలసిన తొమ్మిది రకాల భద్రత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్మార్ట్ రేషన్ కార్డులలో వివరాలు ఇలా
కార్డుపైన ఎడమవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు కుడివైపున పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ముద్రించారు. రేషన్ కార్డు నెంబరు, కుటుంబ యజమాని పేరు, రేషన్ కార్డ్ షాప్ సంఖ్య, గ్రామం, మండలం, జిల్లా, ఇంటి చిరునామా వివరాలు ఈ రేషన్ కార్డులలో చాలా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లను ముద్రించడం గమనించవలసిన అంశం.
హోలోగ్రామ్ నుండి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వరకు 9రక్షణా వ్యవస్థలు
ఈ రేషన్ కార్డులలో సాంకేతికపరమైన అనేక భద్రత ఫీచర్లు జోడించడం వల్ల ఈ కార్డును స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు సులభంగా నిర్ధారణ అవుతాయి. హోలోగ్రామ్ నుండి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వరకు ఈ రేషన్ కార్డులో వివిధ రకాల రక్షణ వ్యవస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఈ కొత్త కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచాలని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల నకిలీలకు చెక్
ఈ ఫీచర్లు నకిలీ కార్డుల తయారీని నివారిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల కార్డు దుర్వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండనున్నాయి. ఇప్పటివరకు కొన్ని సాధారణ కార్డులలో ఉండే సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చర్య ఉండబోతుంది. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఈ రేషన్ కార్డులతో ప్రజలు బేఫికర్ గా ఆహార భద్రతను పొందవచ్చు.













Click it and Unblock the Notifications