ఎయిమ్స్ లో కేంద్రమంత్రి అడ్మిట్- కరోనరీ యాంజియోగ్రఫీ టెస్టులు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తోన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా కార్డియాలజీ విభాగం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుండెల్లో దడ, అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు ఎయిమ్స్ తెలిపింది.
గురువారం సాయంత్రమే ఆయన ఎయిమ్స్ లో చేరారు. గుండె పనితీరును సమగ్రంగా అంచనా వేయడానికి డాక్టర్లు కరోనరీ యాంజియోగ్రఫీ టెస్టులను కూడా నిర్వహించారు. దీని తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వివరించారు. కొంతకాలంగా తీరిక లేకుండా గడుపుతున్నారు జేపీ నడ్డా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలతో పాటు ఆయుష్మాన్ భవ వంటి పథకాలపై సమీక్షలు, నీట్ పరీక్షల అనంతరం తలెత్తిన పరిణామాలపై తరచూ మీడియా ముందుకు వస్తోన్నారు.

ఈ క్రమంలో కొంత ఒత్తిడికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుండెల్లో దడ, అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్డియాలజీ విభాగంలో ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా రక్తనాళాల్లో అవరోధాలను గుర్తించి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించడానికి ఈ యాంజియోగ్రఫీ విధానాన్ని అనుసరిస్తారు.
ప్రాథమిక నివేదికలు పరిశీలించిన అనంతరం ఆయన్ని మరింత జాగ్రత్తగా నిశితంగా గమనించడానికి అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఆందోళన చెందవలసిన పనేమీ లేదని ఎయిమ్స్ డాక్టర్లు పేర్కొంటోన్నారు. ఈ వార్త తెలియగానే పలువురు కేంద్ర మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తోన్నారు. వేగంగా కోలుకోవాలని కోరుకుంటోన్నారు.
ఇప్పటివరకు నడ్డాకు నిర్వహించిన అన్ని రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా సాధారణంగానే వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ డాక్టర్ల సలహా ప్రకారం ఆసుపత్రిలోనే డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంటోన్నారు. పూర్తిగా కోలుకుంటే..ఈ సాయంత్రం లేదా శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.













Click it and Unblock the Notifications