అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ బంగారం, ప్లాటినంతో కట్టావా చంద్రబాబు? లెక్కలతో మాజీమంత్రి!
అమరావతి అంటే నగరం కాదని అవినీతి సామ్రాజ్యం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధనాన్ని దోచుకుంటోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో వేల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని, సీడ్ యాక్సెస్ రోడ్డు మొదలుకొని సచివాలయం, టవర్ల నిర్మాణం వరకు ప్రతి పనిలోనూ విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు 21.77 కి.మీలకు రూ.1,519 కోట్లా?
చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి సీడ్ నుంచి నేషనల్ హైవే వరకు కలిపే ఈ రోడ్డు మొత్తం పొడవు కేవలం 21.77 కిలోమీటర్లు. దీనికి చంద్రబాబు ఏకంగా రూ.1,519 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.. ప్రపంచంలో ఎక్కడైనా 21 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇంత భారీగా ఖర్చు పెట్టడం చూశారా? అంటూ ప్రశ్నించారు.

రూ.100 కోట్లలో పూర్తయ్యే పనిని రూ.465 కోట్లకు ఎందుకు పెంచారో
14.21 కిలోమీటర్ల మొదటి దశ రహదారి నిర్మాణానికి 2017లో రూ.285 కోట్లు మంజూరు చేసి పనులు అప్పగించారు. 2019 నాటికి రూ.185 కోట్లు ఖర్చు చేశారు. అంటే మొదటి అంచనాల ప్రకారం మిగిలింది కేవలం రూ.100 కోట్ల పనులు మాత్రమే. రూ.100 కోట్లతో పూర్తి కావాల్సిన మిగిలిన భాగాన్నిఏకంగా రూ.465 కోట్లకు అప్పగించారు. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనిని రూ.465 కోట్లకు ఎందుకు పెంచారో చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
కనకదుర్గమ్మ వారధి కన్నా సీడ్ యాక్సెస్ ఫ్లైఓవర్ కు అన్ని కోట్లు ఎందుకు?
విజయవాడలో 2.6 కిలోమీటర్ల 6-లైన్ల కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆనాడు రూ.282.4 కోట్లు వెచ్చించారన్నారు. కానీ ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్మిస్తున్న 3.5 కిలోమీటర్ల 6-లైన్ల ఫ్లైఓవర్‌కు రూ.610.5 కోట్లు ఖర్చు చేస్తున్నారని, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కన్నా ఇక్కడ కిలోమీటర్‌కు రూ.72 కోట్లు అదనంగా ఎందుకు పెరిగింది? కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాటాలు పంచుకోవడానికే ఈ రేట్లు పెంచారన్నారు.
కుంగిపోయిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జికి రూ.80 కోట్ల హంగామా!
కుంగిపోయిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జికి రూ.80 కోట్ల హంగామా చేశారని, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లో చంద్రబాబును మించిన వారు లేరని అంబటి ఎద్దేవా చేశారు.
నిర్మాణ రంగంలో దేశంలో ఎక్కడా లేని విడ్డూరమైన రేట్లు అమరావతిలో చూస్తున్నామని, ఐదు ఐకానిక్ భవనాలకు చదరపు అడుగుకు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు అంచనాలు వేశారన్నారు. చదరపు అడుగుకు రూ.22 వేలా? రోడ్లలో బంగారం, ప్లాటినం పోస్తున్నారా? అని ప్రశ్నించారు.
నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బాబుకు ఉందా?
సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. ఈ భారీ అవినీతి చూసే ఆయన డుమ్మా కొట్టారా? నేను వేసిన లెక్కల ప్రశ్నలకు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ సమాధానం చెప్పగలరా? అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో తప్పించుకుంటున్నారన్నారు.
దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి
దమ్ముంటే వైయస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే... సభకు వచ్చి ఈ దోపిడీని ఆధారాలతో సహా నిలదీస్తామని స్పష్టం చేశారు. అనుకూల ఎల్లో మీడియాతో అమరావతిని అద్భుతంగా చిత్రీకరించినా.. చంద్రబాబు చేస్తున్న ఈ చారిత్రక దోపిడీని వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతూనే ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications