తిరుమలలో బీసీసీఐ సెక్రెటరీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.
శుక్రవారం నాడు 70,668 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 38,036 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.64 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
ఈ ఉదయం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా.. శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యలతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయనకు శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని బహూకరించారు అర్చకులు. ఆశీర్వచనాలను పలికారు.
ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్ మ్యాచ్ శుక్రవారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముగిసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించి..ఫైనల్స్‌లో అడుగు పెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఫైనల్స్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొననుంది. ఈ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో షెడ్యూల్ అయింది ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు.
ఈ మ్యాచ్‌ల నిర్వహణ కోసం జై షా రెండు శుక్రవారమే చెన్నైకి వచ్చారు. సోమవారం వరకూ అక్కడే ఉండనున్నారు. ఫైనల్స్‌కు ఒక రోజు ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం ఆయన చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. మళ్లీ సాయంత్రానికి చెన్నైకి బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications