భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్న మోదీ.. 5వేల బస్సుల్లో జనం.. కూటమి భారీ ప్లాన్!
ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరప్రదాయని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. 5 వేల బస్సుల్లో బహిరంగసభకు
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించాలని, ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించి భారీ వెహికల్ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు ఒకటవ తేదీన ప్రధాని భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్న క్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర నుంచి 5000 బస్సుల్లో ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా
విశాఖ నుంచి విమానాశ్రయానికి ప్రయాణికుల కోసం జిఎంఆర్ సంస్థ 69మెట్రో బస్సులను కేటాయించింది. విమానాశ్రయం పక్కనే జిఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ ఎమ్మార్వో ఫ్లైట్ మెయింటెనెన్స్ సదుపాయం కూడా అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న క్రమంలో షెడ్యూల్ మేరకు ఆగస్టు 1న ఉదయం 10.45 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు.
విమానాశ్రయం ప్రారంభం తర్వాత రెండు గంటలు అక్కడే ఉండనున్న మోదీ
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరో రెండు గంటల పాటు అక్కడ ఉండనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. టెర్మినల్ భవనంలో 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో మోడీని స్వాగతిస్తారు.
బహిరంగ సభలో పాల్గొననున్న పీఎం మోదీ
ఆ తర్వాత టెర్మినల్ భవనాన్ని పరిశీలించి, ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదిక చేరుకొని 11:30 నుండి 12 గంటల 55 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications