విభజన: రాజీనామా చేసే ఎంపీలు, మంత్రులు ఎవరు?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తే రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని సీమాంధ్రకు చెందిన కొంత మంది పార్లమెంటు సభ్యులు ప్రకటిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన స్పీకర్ మీరా కుమార్ కార్యాలయంలో కూర్చుని తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామనే కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల మాటలను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు నమ్మడం లేదు.
తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మంత్రి మనీష్ తివారీతో పాటు ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో తాజాగా శుక్రవారంనాడు కూడా ప్రకటించారు. రాజీనామాలు చేయాలా, వద్దా అనే విషయంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో, కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయాన్ని సీమాంధ్ర మంత్రులే చెప్పారు. కానీ, వారిపై రాజీనామాలకు మాత్రం ఒత్తిడి ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం కూడా గుర్తించింది. ఈ విషయాన్ని పిసి చాకో అంగీకరించారు. ఉద్యమ ఒత్తిడి కారణంగా వారు రాజీనామాలకు సిద్ధపడి ఉండవచ్చునని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడానికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మొదట సిద్ధపడ్డారు. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మంత్రుల్లో కిల్లి కృపారాణి, దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు, కావూరి సాంబశివ రావు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే, వీరిలో ఇద్దరు ముగ్గురు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి మాత్రం రాజీనామాకు సిద్ధంగా లేరనే విషయం స్పష్టంగానే తెలిసిపోతోంది. జెడి శీలం కూడా రాజీనామాకు సుముఖంగా లేరనే మాట వినిపిస్తోంది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాత్రం తాను రాజీనామా చేయబోనని స్పష్టంగానే చెప్పారు.
ఇక, పార్లమెంటు సభ్యుల్లో రాయపాటి సాంబశివ రావు సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకే ఆయన సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఆయన మనసులో సీమాంధ్రలో కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయించాలనే తలంపుతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమైక్యాంధ్ర పార్టీని స్థాపింపజేయాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.
రాష్ట్ర విభజనకు ముందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగితే పార్లమెంటు సభ్యుల్లో సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్ రాజీనామాలు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీరు ఇది వరకే స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఈ నెల 24వ తేదీన ఎంత మంది రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారనేది ప్రశ్నగానే ఉంది. పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ మాత్రం రాజీనామాకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు.
రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని లగడపాటి రాజగోపాల్ వంటి అతివాదులు అంటూనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు వస్తే ఓడించాల్సిన అవసరం ఉందనే వాదనను ముందుకు తెస్తున్నారు. దీన్ని బట్టి వారు రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారనే వాదనపై అనుమానాలు బలపడుతున్నాయి.












Click it and Unblock the Notifications