మావోయిస్టులకు బిగ్ షాక్: అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు హతం
ఏపీ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 6గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
మారేడుమిల్లిలో భీకర పోరు
మంగళవారం ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా దళాలు తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేతల్లో ఒకడైన మద్వి హిడ్మా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్ కౌంటర్
మరోవైపు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కూడా మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం సుక్మా జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందినట్లు సమాచారం. కూంబింగ్ కొనసాగింపు: ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలు మావోయిస్టులకు పెను విఘాతాన్ని కలిగించాయి. కీలక నేత మృతిచెందడంతో దళాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications