అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ జెండా పాతాలన్న లక్ష్యంతో గత నాలుగేళ్లుగా తీవ్రంగా శ్రమించిన ఆ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఈసారి ఎన్నికల్లో టికెట్ కేటాయించిన దువ్వాడ శ్రీనివాస్ కు పోటీగా ఆయన భార్య వాణి పోటీకి దిగడంతో తలపట్టుకున్న వైసీపీ అధిష్టానం.. ఎట్టకేలకు ఆమెను ఒప్పించింది. దీంతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
టీడీపీ కంచుకోట అయిన టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో వైసీపీ గత ఎన్నికల తర్వాత నుంచే పావులు కదిపింది. గతంలో శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమిపాలైన దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయనకు బదులుగా బార్య వాణిని ఇన్ ఛార్జ్ గా నియమించిన వైసీపీ తిరిగి ఎన్నికల వేళ దువ్వాడ శ్రీనుకే టికెట్ ఇచ్చింది.

దీంతో నిరాశకు గురైన ఆయన భార్య దవ్వాడ వాణి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే భర్త దువ్వాడ శ్రీనివాస్ తో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న ఆమె.. ఎన్నికల వేళ ప్రత్యర్ధిగా బరిలోకి దిగడంతో చుక్కలు కనిపించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వాణితో చర్చలు జరిపారు. ఆమెకు కీలక హామీలు ఇచ్చారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. టెక్కలి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో దువ్వాడకు లైన్ క్లియర్ అయింది.












Click it and Unblock the Notifications