Sujana Chowdary: సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట..!
ఏపీ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీలో ఎన్నికల తరుణంలో ఆయనపై నమోదైన ఓ కీలక కేసులో లుకౌట్ నోటీసులు పెండింగ్ లో ఉన్న తరుణంలో ఆయనకు హైకోర్టు మరో అంశంలో ఊరట కల్పించింది. దీంతో సుజనా చౌదరి కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లయింది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైన ఈ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం..
సుజనా చౌదరికి చెందిన బెస్ట్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్ధ 5 వేల కోట్ల మేరకు రుణాలు ఎగవేసిందంటూ సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు వీలుగా సీబీఐ లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయినా ఇప్పటివరకూ ఈ కేసులో తదుపరి చర్యలేవీ తీసుకోలేదు. అయితే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం అరెస్టు చేసేందుకు సీబీఐ ఈ లుక్ అవుట్ నోటీసును పెండింగ్ లో ఉంచింది.

ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు అమరికా, సింగపూర్, దుబాయ్, బ్రిటన్, యూరప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే తనపై లుక్ అవుట్ నోటీసు పెండింగ్ లో ఉండటంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సుజనా చౌదరి విదేశీ టూర్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ సుజనాను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోవడం, ఇప్పటికీ ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడం వంటి కారణాలతో హైకోర్టు ఆయనకు విదేశీ టూర్ అనుమతిచ్చింది. అలాగే సుజనా విదేశీ టూర్ కు ముందే ప్రయాణ వివరాలతో పాటు ఫోన్, ఈమెయిల్ నంబర్ ను సీబీఐకి ఇవ్వాలని, జూన్ 20లోగా తిరిగి వచ్చి సీబీఐకి సమాచారం ఇవ్వాలనే షరతులు మాత్రం విధించింది. దీంతో సుజనా ఆ మేరకు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications