Ramgopal Varma: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట..!
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పై నిర్మించిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వం పలు చోట్ల కేసులు నమోదు చేసింది. వీటిపై విచారణకు రావాలని పోలీసులు కోరడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించింది.

వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాంగోపాల్ వర్మపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసుతో పాటు మరో రెండు కేసులున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వర్మ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
అదే సమయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మను విచారణకు రావాలని నోటీసులు పంపారు. దీంతో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దానికి రాకపోవడంతో అరెస్టుకు సిద్దమయ్యారు. దీంతో హైకోర్టులో రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఇతర కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పటికే నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరారు.
ఈ మూడు కేసులపై ఇవాళ విచారణ నిర్వహించిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు కోరినప్పుడు హాజరు కావాలని సూచించింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని సూచించింది. దీంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications