చంద్రబాబుకు బిగ్ షాక్: మరో కేసు నమోదు చేసిన ఏపీ సిఐడీ!!
టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే అనేక కేసుల్లో తలనొప్పి ఎదుర్కొంటున్న చంద్రబాబుకు తాజాగా మరొక కేసు ఇబ్బందిగా మారనుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది.
చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3 గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు మరొక కేసులో ఇరుక్కున్నట్టు అయింది.

ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మద్యం అనుమతుల కేసులో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ని అరెస్ట్ చేయడానికి సిఐడి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
చంద్రబాబు 2014 నుండి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. ఆయన పాలనలో ఐదేళ్ల కాలంలో 254 బ్రాండ్లకు అనుమతి నిచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త కొత్త మార్పులు చేశారు చంద్రబాబు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీ లకు గాను ఏకంగా 14 డిస్టిలరీ లకు అనుమతిని ఇచ్చారని, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారు అన్న కారణంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. చంద్రబాబు బయటకు రాకుండా ఆయనకు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications