వైసీపీకి ఉత్తరాంధ్రలో షాక్- మాజీ కేంద్రమంత్రి రాజీనామా !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధి పార్టీల నుంచి చిన్నా చితకా నేతల్ని కూడా వదలకుండా తమ పార్టీలో చేర్చుకుంటున్న అధికార వైసీపీకి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా రాజకీయాలు చేస్తున్న వేళ పార్టీలో ఉన్న మాజీ కేంద్రమంత్రి ఒకరు ఇవాళ గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

తనకు వైసీపీ పార్టీలో తీవ్ర అన్యాయం, అవమానం జరిగాయని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తామని జగన్ మోసం చేశారని ఆరోపించారు. తనకు వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో మళ్లీ బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారో తెలియదన్నారు. తనకు పదవి కంటే గౌరవం ముఖ్యమని, గౌరవం ఎక్కడ దొరికితే అక్కడకు వెళతానని తెలిపారు.
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించి వైసీపీలో చేరిన కిల్లి కృపారాణికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయితే ఈసారి అయినా టికెట్ ఇస్తారని ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. అంతే కాదు వైసీపీలో తన భవిష్యత్తుకు ఎలాంటి హామీ దక్కకపోవడంతో ఇక చేసేది లేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు తిరిగి తన సొంత పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు కిల్లి కృపారాణి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కీలక సామాజిక వర్గానికి చెందిన కృపారాణి పార్టీని వీడటం వైసీపీకి ఎదురుదెబ్బ కానుంది.
గతంలో శ్రీకాకుళం లోక్ సభ స్ధానంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన కిల్లి కృపారాణికి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం కూడా లభించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు కృపారాణి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. దీంతో కొన్నాళ్లు ఏ పార్టీలో చేరకుండా వేచి చూసిన ఆమె చివరికి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి శ్రీకాకుళం ఎంపీ టికెట్ దక్కించుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications