విశాఖపై బీజేపీ జెండా ఎగిరి తీరుతుంది: కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తా: జీవీఎల్
GVL Narasimha Rao: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాన్ని కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. దీన్ని టీడీపీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా గీతం భరత్ పోటీ చేస్తోన్నారు. టీడీపీ శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆయన రెండో అల్లుడు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. ప్రచారం కూడా మొదలు పెట్టారాయన. తీరా ఈ సీటును కోల్పోవాల్సి వచ్చింది.

దీనిపై జీవీఎల్ స్పందించారు. టికెట్ కోసం తాను విశాఖపట్నం ప్రజలకు సేవ చేయలేదని వ్యాఖ్యానించారు. నిస్వార్థంగా సేవలు చేశానని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని, విశాఖపట్నం సమగ్రాభివృద్ధి కోసం తాను మూడు సంవత్సరాలుగా కృషి చేశానని, అంతే తప్ప టికెట్ కాదని పేర్కొన్నారు.
ఈ మేరకు ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. విశాఖపట్నం లోక్‌సభ టికెట్ తనకు దక్కకపోవడం పట్ల స్పందించారు. తనకు ఫోన్ కాల్ చేసి, వివరాలను ఆరా తీస్తోన్న వారందరి కోసం ఈ వీడియోను విడుదల చేసోన్నట్లు జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రధానమే అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండటానికి, సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా తాను ప్రజల్లోనే ఉంటానని అన్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది ఓ నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.

త్వరలోనే తాను విశాఖపట్నానికి వస్తానని, ప్రజలందరినీ కలుస్తానని జీవీఎల్ అన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలో బీజేపీ జెండా రెపరెపలాడేలా, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తానని చెప్పారు.
విశాఖపట్నం అభివృద్ధే తమ లక్ష్యమని, దీనికోసం అందరం పాటుపడదామని జీవీఎల్ చెప్పారు. విశాఖపట్నానికి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీని మరింత చేరువ చేసేలా కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications