ఏపీపై బీహార్ ఫలితాల ఎఫెక్ట్, మారుతున్న లెక్కలు - జగన్ చూపు అటే..!!
బీహార్ లో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. మోదీ మేజిక్ పని చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ హామీలకు ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏకు ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు. హోరా హెరీ పోరు తప్పదనే అంచనాలు తల కిందులయ్యాయి. మహాఘట్ బందన్ కు ఊహించని పరాభవం మిగిలింది. బీహార్ గెలుపుతో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభావం పైన చ్చ మొదలైంది. ఏపీలో రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది. ఏ కూటమిలో లేని జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి..
ఎన్డీఏకు బీహార్ ప్రజలు ఊహించని విజయం అందించారు. ఏకపక్షంగా మోదీ- నితీశ్ జట్టుకు పట్టం కట్టారు. అందరి అంచనాలను తల కిందులు చేస్తూ 243 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, ఏకంగా 200 పైకా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించారు. మోదీ- నితీశ్ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం.. ఎన్నికల్లో కురిపించిన భారీ వరాలు ఈ స్థాయి విజయాన్ని అందించాయి. దీని తరువాత మోదీ ఇమేజ్ మరింత రెట్టింపు అయింది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అటు వరుస ఓటములతో ఇండియా కూటమి కదులేవుతోంది. ఇటు ఎన్డీఏ వరుస విజయాలతో మరింత బలోపేతం అవుతోంది. ఇప్పుడు ఎన్డీఏలో పార్టీలు సైతం మోదీ నాయకత్వానికి ప్రజా మద్దతు చూసిన తరువాత పూర్తి సహకారం అందించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇక.. ఏపీలో బీహార్ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. 2029 ఎన్నికలే లక్ష్యం గా ఇప్పటికే అటు కూటమి నేతలు.. ఇటు మాజీ సీఎం జగన్ వ్యూహాలు అమలు సిద్దం చేస్తున్నారు. మరో 15 ఏళ్లు కూటమి కలిసే ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. అటు మోదీ నాయకత్వానికి సీఎం చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. మోదీ సమర్థతను ఆకాశానికి ఎత్తుతున్నారు. 2029 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటమే చంద్రబాబు ముందున్న అసలైన లక్ష్యం. ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయం అంతే అవసరం. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలు.. తదనంతర ఫలితాలతో నష్టపోయిన టీడీపీ నాయకత్వం ఈ సారి అప్రమత్తం అయింది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా మోదీ నాయకత్వంలోనే కొనసాగి డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఫలితాలు పొందే ఆలోచన చేస్తోంది.
ఇక, మాజీ సీఎం జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసారు. 2024లో కూటమి పైన సింగిల్ గా పోటీ చేసి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు కూటమి 2029 ఎన్నికల్లో కలిసే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, జగన్ వచ్చే ఎన్నికల కోసం వామపక్షాలు - కాంగ్రెస్ తో జత కడతారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో షర్మిల ప్రభావంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు వైసీపీ ఓటమికి కారణమయ్యాయి. అయితే, పార్టీ నేతలు మాత్రం జగన్ కు ఎవరితో పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వేళ 2029 లక్ష్యంగా ఏపీలో కూటమి నేతలు.. జగన్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు.. చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications