ఫ్రెండూ లేదు.. బొచ్చూ లేదు.. జగన్ తో స్నేహంపై బీజేపీ ఎమ్మెల్యే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఓ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఓవైపు నవ్వులు పూయించగా.. మరోవైపు అసెంబ్లీలో లేని విపక్షానికి ఆగ్రహం పుట్టించేలా ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఓ చర్చలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామకు సైతం నవ్వుకునేలా చేశాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాంలపై ఓ మంత్రిత్వ శాఖ పెట్టాలని తొలుత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఇలాంటివి ఎలా జీర్ణం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. తన ఫ్రెండ్ ఫోన్ చేసి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో నువ్వూ, జగన్ బావుంటారని ప్రశ్నించగా.. బావుండటం ఏంటి అధ్యక్షా.. ఫ్రెండూ లేదూ బొచ్చూ లేదంటూ అన్నానని సరదాగా వ్యాఖ్యానించారు. అంతలోనే తేరుకుని సారీ చెప్పారు. అదే సమయంలో మీలాగే వాడుక భాష అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును ఉద్దేశించి మరో వ్యాఖ్య చేశారు.

విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకు సభలో నవ్వులు కురిశాయి. విష్ణు కామెంట్స్ పై జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ ఆ వ్యాఖ్యలు తొలగిద్దామని ఆయనకు సూచించారు. అలాగే తనను ఎందుకు ఇందులోకి లాగుతున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశంపై చర్చ ముగిసింది. తిరిగి విష్ణుకుమార్ రాజు తన ప్రసంగంలోకి వెళ్లిపోయారు. జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. మాజీ ముఖ్యమంత్రిపై అమెరికాలో వెలుగుచూసిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విష్ణు కోరారు.












Click it and Unblock the Notifications