పార్లమెంట్ లో వైసీపీ డబుల్ గేమ్? బయటపెట్టిన పురందేశ్వరి..!
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తాజాగా ఆమోదింపజేసుకున్న వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఏపీలో అధికార టీడీపీ, జనసేన సమర్థించగా.. వైసీపీ ఏం చేసిందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లోక్ సభలో మాత్రం వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. ఆ తర్వాత మోడీ ఆగ్రహాన్ని గమనించి రాజ్యసభలో మాత్రం మద్దతిచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అసలు పార్లమెంట్ లో ఏం జరిగిందో వెల్లడించారు.
వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం లభించింది. అయితే ముందు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అక్కడ ఎంపీలకు విప్ జారీ చేసి మరీ వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభకు వచ్చే సరికి మాత్రం ఎంపీలకు విప్ జారీ చేసి బిల్లుకు మద్దతిచ్చిందని దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ ఆరోపించారు. పార్లమెంట్ రికార్డులు చూస్తే ఈ విషయం తెలుస్తుందని ఆమె ఇవాళ విజయవాడలో వెల్లడించారు.

ఇప్పటికే వైసీపీ వక్ఫ్ బిల్లుపై డబుల్ గేమ్ ఆడిందన్న ప్రచారాన్ని రాష్ట్రంలో కూటమి పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన వైసీపీ.. తాము రాజ్యసభలోనూ ఎంపీలకు విప్ జారీ చేసి ఈ బిల్లును వ్యతిరేకించినట్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఇవాళ స్వయంగా బీజేపీ ఎంపీ పురందేశ్వరి వైసీపీ రాజ్యసభలో మాత్రం వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చినట్లు చేసిన ప్రకటన ఆ పార్టీని ఇరుకునపడేసింది. పురందేశ్వరి ప్రకటనపై వైసీపీ ఇప్పటివరకూ స్పందించలేదు.












Click it and Unblock the Notifications