ఏపీ డెవలప్‌మెంట్ ప్యాకేజీ-కొత్త ప్లాన్: బాబుకు మోడీ ఆఫర్
న్యూఢిల్లీ/అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ ఆత్మరక్షణలో పడిందా? ఇచ్చిన మాట తప్పిందనే మచ్చ నుంచి ఎంతో కొంత బయటపడే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ నాడు విభజన చట్టంలో పెట్టలేదని, ఇప్పుడు అదే ఇబ్బందులు తెస్తోందని బీజేపీ చెబుతోంది. కానీ, మాట ఇచ్చారని, మీరు ఎలాగైనా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టంలో పెట్టకున్నా ఇవ్వవచ్చునని అంటున్నాయి. మరోవైపు, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు ఏపీకి హోదా ఇస్తే మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో, కేంద్రం ఇరుకున పడింది. ప్రత్యేక హోదాను ఏపీకి ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హోదా బదులు మరో పేరుతో ఏపీకి సాయం చేసే విషయమై కేంద్రం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఏపీ డెవలప్‌మెంట్ ప్యాకేజీ పేరిట త్వరలో ప్రకటన చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి.

ప్రత్యేక హోదాతో ఏపీకి ఏడాదికి రూ.3,500 కోట్లు వస్తాయని, ఏపీకి ప్యాకేజీ పేరిట అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. లోటు బడ్జెట్ కింద రూ.4,700 కోట్లను భర్తీ చేస్తామని, 90 శాతం కేంద్రం చెల్లించేలా పోలవరం నిర్మాణానికి నాబార్డు నుంచి ఆర్థిక సాయం అందించనున్నారు.
అలాగే, వెనుకబడిన జిల్లాలకు రూ.2,100 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ప్యాకేజీని ఈ నెలలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తద్వారా హోదాకు బదులు మెరుగైన ప్యాకేజీ ఇచ్చామని చెప్పడం ద్వారా ఏపీలో తమ పార్టీ పైన ఆగ్రహావేశాలు తగ్గించవచ్చునని భావిస్తోంది.
హోదా లేకుండానే రూ.3500 కోట్ల కన్నా ఎక్కువ మొత్తం ప్రతియేటా ఏపీకి వచ్చేలా చూస్తామని కేంద్రం ప్రతిపాదిస్తోందని అంటున్నారు. విదేశీ రుణ సంస్థల నుంచి ఏడాదికి 5 వేల కోట్లు ఏపీకి వచ్చేలా చూస్తామని, అందులో 90 శాతం తామే కడతామని, ఫలితంగా రాష్ట్రంపై భారం పడదని కేంద్రం చెబుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications