పవన్ కు సవాల్ విసిరిన బీజేపీ-బద్వేల్లో పోటీకి రెడీ-జనసేనాని ప్రచారం-పొత్తూ కొనసాగుతుం
ఏపీలో రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ అవుతందని భావిస్తున్న కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ సీటు ఉపఎన్నిక ఇప్పుడు కాక రేపుతోంది. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే వెంకయసుబ్బయ్య భార్య డాక్టర్ సుధను బరిలోకి దింపిన వైసీపీ.. ఏకగ్రీవం చేద్దామని విపక్షాలకు ప్రతిపాదించింది. దీంతో జనసేన, టీడీపీ వెనక్కి తగ్గాయి. కానీ బీజేపీ మాత్రం పోటీ చేయాలని నిర్ణయించింది.
బద్వేల్ ఉపఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ఇవాళ ప్రకటించారు. ఇప్పటికే తమ మిత్రపక్షం జనసేన అక్కడ పోటీ చేయరాదని నిర్ణయించిన నేపథ్యంలో సోము వీర్రాజు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మిత్రపక్షం వ్యక్తిగత కారణాలతో కాకుండా దివంగత ఎమ్మెల్యే కుటుంబానికి సంఘీభావంగా బద్వేల్ పోటీ నుంచి తప్పుకుంది. కానీ ఇప్పడు బీజేపీ అక్కడ పోటీ చేయాలని నిర్ణయించడం జనసేనకు సైతం సంకటంగా మారబోతోంది.

బద్వేల్లో పోటీ చేసేందుకు ముందు సిద్ధమైన జనసేనకు... తాము అధిష్టానాన్ని అఢిగి చెప్తామని బీజేపీ ప్రతిపాదించింది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తాము అక్కడ పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. దీంతో ఇవాళ బీజేపీ కూడా సొంతంగా నిర్ణయం తీసుకుని పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు ప్రచారానికి పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానిస్తామని ప్రకటించి బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ఆయనకు సవాల్ విసిరారు.
అలాగే బీజేపీ-జనసేన పొత్తుపైనా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీవైపు మొగ్గు చూపవచ్చన్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. తద్వారా దీనిపై వస్తున్న రూమర్లను ఆయన కొట్టిపారేశారు. అయితే బద్వేల్లో పోటీపై మాత్రం సోమువీర్రాజు తీసుకున్న నిర్ణయం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ ప్రచారానికి పవన్ వస్తారా రారా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. ఒకవేళ పవన్ రాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తుకు జనసేన గుడ్ బై చెప్పేసినట్లే అవుతుందా అన్న వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications