క్షుద్రపూజల పేరిట మోసం: ఆరుగురి అరెస్ట్(ఫొటోలు)
హైదరాబాద్: మంత్రాల పేరుతో అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు మంత్రగాళ్లను దక్షిణ మండలం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పురానీహవేలీలోని దక్షిణ మండలం డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిసిపి సత్యనారాయణ, అదనపు డిసిపి కె బాబురావు ఈ మేరకు వివరాలు తెలిపారు.
మొగల్‌పురా ఠాణా పరిధిలోని సుల్తానాషాహి వాల్మీకినగర్ ప్రాంతానికి చెందిన బల్వీర్ సింగ్(75), అతని కుమారుడు ముఖేశ్ కుమార్ సింగ్(33), డి. సంజయ్ కుమార్(30)తో పాటు శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలియాబాద్‌కు చెందిన బెల్లూరి శ్రీకాంత్ సాగర్(30), ఛత్రినాక ఠాణా పరిధిలోని ఉప్పుగూడ శివసాయినగర్‌కి చెందిన బి యాదయ్య(45), లాల్ దర్వాజాకు చెందిన రోడ్డా దేవానంద్ అలియాస్ నందు(45) మంత్రగాళ్లుగా చలామణి అవుతున్నారు.

క్షుద్రపూజలు చేసి సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీలో క్షుద్రపూజల పేరుతో అమాయకులను కొందరు మోసం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు.

బుధవారం రాత్రి అమావాస్య కావడంతో దక్షిణ మండలం పోలీసులు 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొగల్‌పురా, శాలిబండ, ఛత్రినాక పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేసి క్షుద్రపూజలు చేస్తున్న ఆ ఆరుగురు మంత్రగాళ్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications