కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే సమయం మిగిలున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ నిన్న కాకినాడలో జరిగిన మేమంతా సిద్దం సభలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ పై దూకుడుగా విమర్శలు చేసిన జగన్ అందులో తడబడ్డారు. పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని పొరబాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గతంలో పాలకొల్లులో పోటీ చేశారని, పిఠాపురం పవన్ కు నాలుగో నియోజకవర్గమంటూ సీఎం జగన్ కాకినాడ సభలో వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కు నాలుగో భార్య లాగే నాలుగో నియోజకవర్గమంటూ జగన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి పాలకొల్లులో పవన్ ఎప్పుడూ పోటీ చేయలేదు. పవన్ సోదరుడు చిరంజీవి పాలకొల్లులో 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే పవన్ కు పిఠాపురం మూడో నియోజకవర్గం మాత్రమే. గత ఎన్నికల్లో తొలిసారి భీమవరం, గాజువాకలో పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడిపోయారు.

కాకినాడ సభలో పవన్ పై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు విని జనంతో పాటు వేదికపై ఉన్న వైసీపీ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారు. దీంతో మరోసారి సీఎం జగన్ కు స్పీచ్ లు ఇస్తున్న వారిపై చర్చ జరుగుతోంది. గతంలోనే పవన్ కు ముగ్గురు భార్యలుంటే నలుగురు భార్యలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేనాని నాలుగో భార్య జగనే అని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జనసేన నాయకులు ట్రోలింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications